USA: టీచరమ్మను అరటిపండుతో కొట్టి ఆసుపత్రి పాల్జేశారు!
- అమెరికాలో విచిత్ర సంఘటన
- అరటిపండు అలర్జీతో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు
- ఆటపట్టించేందుకు టీచర్ ను అరటిపండ్లతో కొట్టిన తుంటరి విద్యార్థులు
మానవులకు ఉండే వ్యాధి నిరోధక శక్తి కొన్నింటిని ప్రతిఘటించలేదు. ఇమ్యూనిటీ చేతులెత్తేసిన సమయంలోనే అలర్జీ అధికమవుతుంది. అలర్జీల్లో చాలా రకాలు ఉంటాయి. కొందరికి ఫ్రూట్స్ పడవు. అమెరికాలోని ఓహియోలో ఓ పాఠశాలలో పనిచేసే టీచర్ కు కూడా అరటిపండు అంటే అలర్జీ ఉంది. ఆమె తన క్లాస్ రూమ్ కు బనానా ఫ్రీ జోన్ అంటూ బోర్డు కూడా పెట్టుకుంటారు. దానర్థం, అక్కడికి ఎవరూ అరటిపండ్లు తీసుకురాకూడదు.
అయితే, ముగ్గురు ఆకతాయి విద్యార్థులు ఆమెను ఇబ్బందిపెట్టాలని భావించి డోర్ హ్యాండిల్స్‌కు అరటిపండు గుజ్జు పూయడమే కాకుండా, తొక్కతీసిన అరటిపండ్లను గురిచూసి ఆమెపైకి విసిరారు. అరటిపండ్లు తగిలిన పావుగంటకే ఆ టీచర్ శరీర వర్ణం మారిపోయింది. దాంతో ఆమెకు అలర్జీ నిరోధక ఎపిపెన్ అనే ఔషధాన్ని ఇచ్చారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఉపాధ్యాయురాలు ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఆ ముగ్గురు తుంటరి విద్యార్థులను అరెస్ట్ చేశారు.