Rajasthan: మరోమారు రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్!
- ఈ దఫా రాజస్థాన్ నుంచి బరిలోకి
- 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్
- కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఈ దఫా ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీలో దిగనున్నారు. మన్మోహన్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్యారెంటీగా గెలిచే సీటు నుంచే ఆయన్ను బరిలోకి దింపాలని కూడా పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.
కాగా, 26వ తేదీన రాజస్థాన్, యూపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలను ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లో బీజేపీ ఎంపీ మదన్ లాల్ సైనీ కన్నుమూయడంతో, యూపీలో సమాజ్వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్, బీజేపీలో చేరి రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలూ ఖాళీ అయ్యాయి. మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడిగా 1991 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చారు. నాడు పీవీ నరసింహారావు తన క్యాబినెట్ లో మన్మోహన్ కు చోటు కల్పించడంతో, అసోం నుంచి రాజ్యసభకు పోటీ చేసి గెలిచారు. ఆపై నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.