Andhra Pradesh: అన్న క్యాంటీన్ల మూసివేత నేపథ్యంలో.. విజయవాడలో భోజనాలు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె!
- పలుచోట్ల మూతపడ్డ అన్న క్యాంటీన్లు
- ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత ఆగ్రహం
- ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో అన్న క్యాంటీన్ ను మూసివేయడంపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈరోజు ఆందోళనకు దిగారు. నల్ల జెండాలు చేతపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్న క్యాంటీన్లను కొనసాగిస్తున్నారా? అని మేం అడిగితే మున్సిపల్ మంత్రి బొత్స కొనసాగిస్తున్నామని జవాబు ఇచ్చారు. పవిత్రమైన శాసనసభలో చెప్పిన సమాధానాన్ని కూడా వాళ్లు నిలుపుకోలేని స్థితిలో, సమాధానం చెప్పిన 2 గంటలకే ఏపీలోని 204 అన్న క్యాంటీన్లకు తాళం వేశారు. కావాలంటే అన్న క్యాంటీన్ల పేరు మార్చుకోండి.
మీరు ఎలక్షన్ లో గెలిచారు కాబట్టి మీ(జగన్) పేరు, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి. కానీ మేం కోరేది ఏంటంటే పేదవారికి రోజుకు రూ.15లతో భోజనం దొరుకుతోంది. రాణిగారితోట ప్రాంతంలో నూటికి నూరు శాతం పేదవారే. ఇక్కడ పెన్షన్లతోనే బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు అన్న క్యాంటీన్లు లేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం మళ్లీ క్యాంటీన్లు ప్రారంభించేవరకూ ప్రజలు ఆకలితో అల్లాడాలా? అవినీతి జరిగితే ఎంక్వైరీ చేసుకోండి. కానీ భోజనం ఆపడం ఏంటి?’ అని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే భోజనాన్ని పంచారు. అయితే తాము భోజనం పంచడానికి వీల్లేదని అధికారులు చెప్పారన్నారు.