Andhra Pradesh: సిగ్గుపడవయ్యా విజయసాయిరెడ్డి.. సిగ్గుపడు!: దేవినేని ఉమ ఆగ్రహం
- పోలవరం టెండర్ల రద్దును ఏకపక్షంగా చేశారు
- కేంద్రానికి కనీస సమాచారం ఇవ్వలేదు
- విజయసాయికి దమ్ముంటే షెకావత్ వ్యాఖ్యలపై ట్వీట్ చేయాలి
పోలవరం ప్రాజెక్టు పనులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ సంధించిన ప్రశ్నలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఏంటని అడిగారు. విజయవాడలో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిశాక దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు.
‘ఈరోజు పోలవరం డ్యామ్ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు కిందకు వెళుతోంది. 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలను బయటకు రమ్మన్నారంటే పోలవరం ప్రాజెక్టుపై మీకు చిత్తశుద్ధి ఏముంది? వరద పోటెత్తుతున్న తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా బయటకు రావాలని చెప్పడం వెనుక మీ దుర్మార్గమైన ఆలోచనలు ఏంటి? మీ బాధ్యత ఏంటి అని అడుగుతున్నా. ఇంకా బాధ్యత లేకుండా విజయసాయిరెడ్డి మాపైన ట్వీట్ చేస్తున్నాడు, పోలవరం మీద.
సిగ్గుపడాలయ్యా నువ్వు. ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తున్నావ్. కేంద్ర మంత్రులు ఈ విధంగా లోక్ సభలో మాట్లాడుతుంటే సిగ్గుపడవయ్యా విజయసాయిరెడ్డి.. సిగ్గుపడు. పరిగెత్తే ప్రాజెక్టుకు కాలు అడ్డం పెట్టారు. దీనికి మేం బాధపడుతున్నాం’ అని దేవినేని ఉమ మండిపడ్డారు. ఓ పవర్ ప్రాజెక్టు కోసమే పోలవరం టెండర్ ను రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే కేంద్ర మంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్ చేయాలన్నారు.