Perni Nani: తన అవినీతి బయటపడుతుందనే ఆందోళన దేవినేని ఉమలో కనిపిస్తోంది: పేర్ని నాని
- సీఎం జగన్ ను మెచ్చుకోకుండా విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం
- బందరు పోర్టుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- షెకావత్ వ్యాఖ్యలు పార్టీ పరమైనవని వెల్లడి
పోలవరం ప్రాజక్టు విషయంలో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరించిన దేవినేని ఉమ తన అవినీతి బయటపడుతుందేమోనని ఆందోళన చెందుతున్నాడని ఆరోపించారు. పీపీఏలపై అవినీతి ప్రక్షాళన చేస్తున్న సీఎం జగన్ ను మెచ్చుకోకుండా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పైగా, బందరు పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టులో గత ఐదేళ్ల కాలంలో చిటికెడు మట్టి పని కూడా జరగలేదని పేర్ని నాని విమర్శించారు.
ఇక, పోలవరం బాధ్యత రాష్ట్రానిదేనంటూ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, షెకావత్ ఓ బీజేపీ నేతగా ఆ వ్యాఖ్యలు చేశారని పేర్ని నాని వివరించారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న బీజేపీ ఆకాంక్ష షెకావత్ మాటల్లో ప్రతిఫలించిందని అన్నారు.