KTR: 130 మంది తెలుగు విద్యార్థులు జమ్మూ చేరుకున్నారు... వారు హైదరాబాద్ వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం: కేటీఆర్
- కశ్మీర్ లోయలో ఉద్రిక్తత
- భక్తులను, విద్యార్థులను వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
- తమను కాపాడాలంటూ కేటీఆర్ కు సమాచారం అందించిన తెలుగు విద్యార్థులు
- వెంటనే స్పందించిన కేటీఆర్
కశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అమర్ నాథ్ యాత్రికులతో పాటు, ఎన్ ఐటీ శ్రీనగర్ విద్యార్థులను కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో, తాము శ్రీనగర్ లో చిక్కుకుపోయాయని, తమను కాపాడాలంటూ ఎన్ ఐటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థులు సురక్షితంగా జమ్మూ చేరుకోవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
130 మంది తెలుగు విద్యార్థులు జమ్మూ చేరుకున్నారని, వారిని అక్కడి నుంచి రైలు ద్వారా సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ తీసుకువస్తామని ట్వీట్ చేశారు. ప్రభుత్వం టికెట్లు ఏర్పాటు చేస్తోందని వివరించారు. అంతకుముందు, తెలుగు విద్యార్థుల విషయం తెలియగానే, ఢిల్లీలో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఫోన్ నంబర్లు ట్విట్టర్ లో ఉంచారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి సాయం కావాలన్నా ఆ ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.