Godavai: ధవళేశ్వరానికి పోటెత్తుతున్న వరద...రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ

  • భారీగా వచ్చి పడుతున్న వరద నీరు
  • నీటి మట్టం 13.9 అడుగులకు చేరిక
  • భద్రాచలం వద్ద పరిస్థితి ఇదే

ధవళేశ్వరం ఆనకట్టకు వరద పోటెత్తుతోంది. ఎగువన పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న  వర్షాల కారణంగా బ్యారేజీకి భారీగా ప్రవాహం వచ్చిచేరుతోంది. ఇప్పటికే బ్యారేజీ నీటి మట్టం 13.9 అడుగులకు చేరడం, మరోవైపు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వకు 7,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, 13.10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం 45.5 అడుగుల వద్ద ఉండగా మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

ఇక తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వరుసగా ఐదో రోజూ జలదిగ్బంధంలోనే ఉంది. గండి పోచమ్మ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతంలో దాదాపు 600కు పైగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మండలంలోని 32 గ్రామాలు నీట మునిగాయి.  ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

విష సర్పాలు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు భయభ్రాంతులకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అలమటిస్తున్నారు. సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని బాధితులు వాపోతున్నారు.  పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా బాధితులు పట్టించుకోవడం లేదు.

  • Loading...

More Telugu News