Andhra Pradesh: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తీరును తప్పుపట్టిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్!
- ఎవరైనా విలువలతో కూడిన రాజకీయం చేయాలి
- రాజ్యాంగాన్ని కాపాడాల్సినవారే అనైతికను ప్రోత్సహిస్తున్నారు
- వెంకయ్యనాయుడు చేసింది ముమ్మాటికి తప్పే
దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట దశలో ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. ఎవరైనా సరే విలువలతో కూడిన రాజకీయం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ గొంతు నొక్కే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సందర్భంగా రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరితే వెంకయ్య నాయుడు ఆమోదించడం తప్పని తమ్మినేని సీతారామ్ అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినవారే అనైతికతను ప్రోత్సహించడం సరికాదన్నారు. తానెప్పుడూ ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా ఉందని, మీడియా క్రియాశీలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతోందని, స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయని తమ్మినేని అన్నారు.
శాసన సభలో 3 ఛానళ్లపై నిషేధం విధించడాన్ని తాను సమర్ధించానని చెప్పారు. ‘శాసనసభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్ లు ఇవ్వకూడదని నిబంధన ఉంది. భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం విధించాం. దీనిపై ఛానళ్ల యాజమాన్యాలు ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం’ అని తమ్మినేని పేర్కొన్నారు.