Zapata: జెట్ బోర్డు సాయంతో సముద్రాన్ని దాటిన ఫ్రెంచ్ వీరుడు
- గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన ఫ్రాంకీ జపాటా
- జూలైలోనూ విఫలయత్నం
- తాజాగా విజయవంతంగా ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ భూభాగంపై దిగిన జపాటా
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ ఆవిష్కరించిన అద్భుత సాధనమే జెట్ ఫ్లై బోర్డు. ఓ వ్యక్తి దీని సాయంతో గాల్లోకి ఎగరడమే కాకుండా ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేయవచ్చని ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాంకీ జపాటా అనే సాహసికుడు నిరూపించాడు. ఇప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన జపాటా తాజాగా అద్భుత విజయం సాధించాడు. గత నెలలో కూడా ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ ప్రయాణించే క్రమంలో లక్ష్యానికి ముందుగానే సముద్రంలో పడిపోయాడు.
కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నించి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల మధ్య ఉన్న సముద్ర భాగాన్ని అవలీలగా దాటేసి తన కల నెరవేర్చుకున్నాడు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘనత సాధించాడు. జపాటా ఈ క్రమంలో గంటకు 170 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించాడు. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఓ బోట్ పై దిగి ఇంధనం నింపుకుని తిరిగి గాల్లోకి లేచాడు. జపాటాకు ఈ ప్రయోగాల కోసం ఫ్రాన్స్ సైన్యం భారీగా నిధులు సమకూర్చుతోంది.