Godavari Districts: ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాం: ఏపీ మంత్రి సుచరిత

  • 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపునకు గురయ్యాయి
  • వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందిస్తున్నాం
  • వరద సహాయక చర్యలను రాజకీయకోణంలో చూడొద్దు

గోదావరి జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 194 ఎస్డీఆర్ఎఫ్, 120 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించారని, పశ్చిమగోదావరి జిల్లాలో 47 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని వివరించారు. వరద సహాయక చర్యలను రాజకీయకోణంలో చూడటం దారుణమని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందని, అక్రమాలకు పాల్పడిన వారిని విడిచి పెట్టమని హెచ్చరించారు. ఏపీలో ఇసుక కోసం ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, కొత్త ఇసుక పాలసీ వచ్చే వరకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవని, ఇవన్నీ తాత్కాలిక సమస్యలేనని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జలదిగ్బంధంలో ఉన్న దేవీపట్నంలోని 32 గ్రామాలను 5 భాగాలుగా విభజించామని అన్నారు. 5 భాగాలుగా విభజించి అధికారులను నియమించామని, 7 సంచార వైద్య శిబిరాలు, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం 4 శాటిలైట్ ఫోన్లు, 20 బస్సులను వినియోగిస్తున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News