USA: వైఫై పాస్ వర్డ్ అడిగిందని అక్కను చంపిన తమ్ముడు.. జీవితఖైదు!
- అమెరికాలో ఘటన
- వీడియో గేమ్స్ కు బానిసైన టీనేజ్ కుర్రాడు
- ఇంట్లో ఇంటర్నెట్ పాస్ వర్డ్ మార్చిన వైనం
- కొత్త పాస్ వర్డ్ చెప్పమన్నందుకు దారుణం
అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. వైఫై పాస్ వర్డ్ కోసం ఒత్తిడి చేసిన అక్కను సొంత తమ్ముడే హతమార్చాడు. ఈ కేసు కోర్టులో విచారణకు రాగా నిందితుడికి జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చాడు. ఈ కేసు వివరాల్లోకి వెళితే, కెవాన్ వాట్కిన్స్ అనే 18 ఏళ్ల టీనేజ్ కుర్రాడు అస్తమానం వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. అయితే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల తన వీడియో గేమింగ్ కు అంతరాయం కలుగుతోందని భావించి వైఫై పాస్ వర్డ్ మార్చేశాడు.
దాంతో అతడి తల్లి, సోదరి పాస్ వర్డ్ ఎందుకు మార్చావంటూ వాట్కిన్స్ పై గొడవకు దిగారు. సోదరి కొత్త పాస్ వర్డ్ చెప్పాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమెను గొంతు పట్టుకుని పైకిలేపి అలాగే గోడకు అదిమి పట్టాడు. కుమార్తెను విడిపించేందుకు తల్లి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. దాంతో తల్లి పోలీసులకు సమాచారం అందించగా, వారు ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. వాట్కిన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.