Godavari: వెల్లువెత్తిన గోదావరి... సఖినేటిపల్లి, నరసాపురం మధ్య రాకపోకలు బంద్!
- నదిపై అందుబాటులోలేని వంతెన
- గోదావరికి ఉద్ధృతంగా వరద
- వాపోతున్న ప్రజలు
తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకూ... మధ్యలో ఉండేది గోదావరి నది మాత్రమే. అటు నుంచి ఇటు నిత్యమూ తిరిగే పంట్లు, లాంచీలు ఇప్పుడు ఆగిపోయాయి. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటమే ఇందుకు కారణం. అంతర్వేది క్షేత్రానికి వచ్చే పర్యాటకులతో పాటు మలికిపురం, లక్కవరం తదితర ప్రాంతాలకు వచ్చే వారంతా నదిని దాటే వస్తారు. నరసాపురం నుంచి సఖినేటి పల్లి రేవుకు అర కిలోమీటర్ దూరం కూడా ఉండదు. కార్లు, జీపులు, లారీలు, ద్విచక్రవాహనాలు సహా ప్రజలంతా పంట్ల మీద ప్రయాణిస్తూ నదిని సులువుగా దాటేస్తుంటారు.
కానీ, ఇప్పుడు నది ఉద్ధృతంగా ఉండటంతో, అటు నుంచి ఇటువైపుకు, ఇటు నుంచి అటువైపుకు పంట్ల, చిన్న పడవలను అధికారులు నిలిపివేశారు. దీంతో ఇటువైపువారు ఎవరు నరసాపురం వెళ్లాలన్నా, సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ఓ వంతెన కావాలని తాము సుదీర్ఘకాలంగా కోరుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ఆ కారణంగానే ఈ పరిస్థితిని నిత్యమూ తాము ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ ప్రాంతం ప్రజలు వాపోతున్నారు.