Amit Shah: కశ్మీర్ అంశంలో ఏపీ విభజన ప్రస్తావన తీసుకువచ్చిన అమిత్ షా, ఆజాద్ లకు వెంకయ్య హితవు
- రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దుపై వాదోపవాదాలు
- ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ ఆజాద్ ధ్వజం
- ఏపీ ప్రస్తావన తీసుకువచ్చిన అమిత్ షా
- ఎంతో కసరత్తు చేసి విభజన నిర్ణయం తీసుకున్నామని చెప్పిన ఆజాద్
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై రాజ్యసభలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూకశ్మీర్ అంశంలో కేంద్రానిది ఏకపక్ష నిర్ణయం అంటూ విమర్శించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గతంలో ఆదరాబాదరాగా ఏపీని విడగొట్టింది మీరేనంటూ ఆరోపణలు చేశారు.
అయితే, ఆజాద్ అందుకు అభ్యంతరం చెప్పారు. తెలుగు రాష్ట్రాల విభజనకు తామేమీ తొందరపడలేదని, 20కి పైగా సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు. తానే మధ్యవర్తిగా, సమన్వయకర్తగా వ్యవహరించానని చెప్పారు. అందరితో మాట్లాడాకే ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, "ఇది ముగిసిన అధ్యాయం, ఇప్పుడు మాట్లాడుతోంది ఏపీ విభజనపై కాదు, మనం మాట్లాడుకుంటున్నది కశ్మీర్ అంశం గురించి" అంటూ స్పష్టం చేయడంతో ఆ వాదోపవాదాలు అంతటితో ముగిశాయి.