GVL: ప్రత్యేక హోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడతారు: జీవీఎల్
- తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా సమయం ఉందన్న బీజేపీ నేత
- మోదీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారంటూ వ్యాఖ్య
- ఆర్టికల్ 370 రద్దుతో ప్రజాహితం కోసం పనిచేసేది బీజేపీయేనని రుజువైందంటూ వెల్లడి
ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ కు కొత్తరూపు ఇచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది ఒక్క బీజేపీ మాత్రమేనన్న విషయం ఆర్టికల్ 370 రద్దుతో నిరూపితమైందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఏపీకి ప్రత్యేకహోదా, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశాలపైనా స్పందించారు. ప్రత్యేకహోదా గురించి పనీపాటా లేనివారే మాట్లాడుతుంటారని, కాలక్షేపం కోసం ప్రత్యేకహోదా అనడం అలవాటైపోయిందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా సమయం ఉందని, దీనిపై మోదీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని జీవీఎల్ పేర్కొన్నారు.