Amit Shah: ముందే మీడియా కంటికి అమిత్ షా రహస్యపత్రాలు!
- 'టాప్ సీక్రెట్' పత్రాలు మీడియా కంటికి
- ఎప్పుడు ఏం జరగాలో రాసుకున్న అమిత్ షా
- సభలో బిల్లు, వెంటనే రాష్ట్రపతి గెజిట్
- వైరల్ అయిన ఫోటో
అవి అత్యంత రహస్యంగా ఉండాల్సిన పత్రాలు. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ, సభలోకి అమిత్ షా రాకముందే, ఏం జరుగుతుందన్నది మీడియాకు తెలిసిపోయింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం పార్లమెంటు వద్దకు వచ్చిన అమిత్ షా, మీడియాకు నమస్కారం పెట్టి ముందుకెళ్లారు. ఇదే సమయంలో ఆయన చేతిలో 'టాప్ సీక్రెట్' అని రాసున్న పత్రాలు ఉన్నాయి. వీటిని మీడియా క్లిక్ మనిపించింది.
ఆర్టికల్ 370 రద్దుపై తీసుకోవాల్సిన చర్యలను అమిత్ మూడు అంశాలుగా వర్గీకరించినట్టు ఇందులో కనిపిస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు విషయాన్ని నివేదించానని, కేబినెట్ సమావేశం తరువాత పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలనీ, అదే సమయంలో రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని కూడా అందులో స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యసభలో భద్రత విషయమై ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడితో చర్చిస్తారని ప్రత్యేకంగా ఉంది.
అంతేకాదు, అఖిలపక్ష భేటీ, 7న జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసే ప్రసంగం వివరాలూ ఉన్నాయి. ఈ బిల్లు అమలులోకి రావాలంటే, 50 శాతం కన్నా అధిక రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సివుండటంతో, అన్ని రాష్ట్రాల సీఎంలతోనూ మోదీ మాట్లాడతారని అమిత్ షా నోట్ లో ఉండటం గమనార్హం.