GHMC: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పోటీ... అంగీకరించిన చంద్రబాబు!
- లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ
- జీహెచ్ఎంసీ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ
- చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్న టీటీడీపీ నేతలు
త్వరలో జరగాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను బరిలోకి దించనుంది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన టీడీపీ, ఆపై పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆపై జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగానే సీట్లు సంపాదించుకుంది. గ్రేటర్ పరిధిలో టీడీపీకి చెప్పుకొతగ్గ ఓట్ బ్యాంక్ ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పలువురు నేతలు కలిసి విన్నవించారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నేత పీ సాయిబాబు, జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చంద్రబాబుతో సమావేశం అనంతరం సాయిబాబు మీడియాకు వెల్లడించారు. టీడీపీ తరఫున క్రియాశీలకంగా పార్టీ కోసం పని చేస్తున్న వారి జాబితాను ఈ సందర్భంగా చంద్రబాబుకు అందజేశామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీని నిలిపేందుకు ప్రతి ఒక్కరమూ కలిసికట్టుగా కృషి చేస్తామని అన్నారు. బీజేపీ వాపును చూసి బలుపనుకుంటోందని విమర్శించారు.