India: మహాకుట్రకు పాకిస్థాన్ స్కెచ్.. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ విడుదల!
- ఆర్టికల్ 370ని రద్దుచేసిన భారత్
- ప్రతీకారంతో రగిలిపోతున్న పాకిస్థాన్
- సయీద్ ద్వారా ఉగ్రదాడులకు ప్రణాళిక
జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని, అలవికాని హింసను నియంత్రించడంతో పాటు జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ పాకిస్థాన్ దేనికైనా సిద్ధమని ప్రకటించింది. తాజాగా అందుకు అనుగుణంగానే ముంబై ఉగ్రదాడుల సూత్రధారి లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ ను జైలు నుంచి విడుదల చేసింది.
అమెరికా కన్నెర్ర చేయడంతో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించాడన్న ఆరోపణలతో సయీద్ ను గత నెల 17న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 13 మంది జమాత్ ఉద్ దవా నేతలపై ఉగ్రవాదులకు సాయం, మనీలాండరింగ్ వంటి రెండు డజన్లకు పైగా కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా గతంలో పెండింగ్ లో ఉన్న కేసులను కూడా తవ్వితీశారు.
అయితే భారత్ కశ్మీర్ విషయంలో దూకుడుగా వెళ్లడంతో పాకిస్థాన్ రూటు మార్చింది. నేరుగా భారత్ తో తలపడకుండా, ముంబై ఉగ్రదాడులను విజయవంతంగా చేపట్టిన సయీద్ ను విడుదల చేసింది. కాగా, జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం, ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా సయీద్ భారత్ లో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు రక్షణ, భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్ ను దొంగ దెబ్బ తీసేందుకే సయీద్ ను పాక్ విడుదల చేసిందని చెబుతున్నారు. ఇప్పటికైనా భారత్ అప్రమత్తం కాకుంటే సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాట్లు అమాంతం పెరుగుతాయనీ, తీవ్రస్థాయిలో ఉగ్రదాడులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. 2008, నవంబర్ లో లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైపై చేసిన దాడిలో 166 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు.