Actor: నటుడు శివాజీ మరోసారి అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

  • లుక్ అవుట్ నోటీసుల విషయమై హైకోర్టును ఆశ్రయించిన శివాజీ
  • ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం
  • రేపటి నుంచి 3 వారాల వరకూ శివాజీ అమెరికా వెళ్లొచ్చన్న న్యాయస్థానం

అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు శివాజీపై లుక్ ఔట్ నోటీసులు తొలగించని కారణంగా ఆయన అమెరికా ప్రయాణానికి ఆటంకం కలిగిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును శివాజీ ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. శివాజీ మరోమారు అమెరికా వెళ్లేందుకు అనుమతించింది. రేపటి నుంచి మూడు వారాల వరకూ అమెరికా వెళ్లేందుకు శివాజీకి హైకోర్టు అనుమతించింది. అలంద మీడియా కేసులో శివాజీపై జారీ అయిన లుకౌట్ నోటీసులను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇటీవల అమెరికా వెళ్తున్న శివాజీని పోలీసులు అడ్డుకున్నారని, దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని వెనక్కి పంపారని న్యాయస్థానానికి వివరించి చెప్పారు. శివాజీపై ఉన్న లుకౌట్ నోటీసులను ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ లో తొలగించలేదని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని శివాజీ తరపు న్యాయవాది కోరారు.

పోలీసుల తరపు న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్ నోటీసులు తొలగించేందుకు మూడు రోజులు పడుతుందని చెప్పారు. ఆ ఆదేశాలు సీఐడీకి చేరి, అక్కడి నుంచి ఇమ్మిగ్రేషన్ అధికారులకు వెళ్లాలని వివరించారు. గత నెల 24న హైకోర్టు తీర్పు వచ్చిందని, ఆ మర్నాడే అమెరికాకు బయలుదేరిన శివాజీని భారత్ లో ఎవరూ ఆపలేదని, దుబాయ్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆయన్ని ఆపారని న్యాయస్థానానికి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ తతంగం అంతా సమాచార లోపం వల్ల జరిగిందిగా భావించింది. 

  • Loading...

More Telugu News