NMC: జూనియర్ల డాక్టర్ల ధర్నాలో పాల్గొన్న హీరో రాజశేఖర్
- ఎన్ఎంసీ బిల్లును తీసుకొచ్చిన కేంద్రం
- దేశవ్యాప్తంగా వ్యతిరేకత
- హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన జూడాలు
కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోనూ జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించగా, టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కూడా సంఘీభావం ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్ఎంసీ బిల్లు ఆసరాతో ఆరు నెలల కోర్సు పూర్తి చేసి డాక్టర్ అవడం అనేది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
ఈ ఆర్నెల్ల బ్రిడ్జి కోర్సు ద్వారా అనర్హులు సైతం డాక్టర్లుగా చలామణి అవుతారని రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి డాక్టర్ల కారణంగా జరిగే అనూహ్య సంఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల పక్షాన ఉండాలని, హడావుడి నిర్ణయాలతో అందరూ ఇబ్బందిపడతారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో రోగులు చనిపోతే డాక్టర్లపై దాడి చేస్తున్నారని వివరించారు. తాను 80వ దశకంలో మెడిసిన్ చదివినా, ప్రస్తుతం ప్రాక్టీస్ చేయడం లేదని రాజశేఖర్ ఈ సందర్భంగా వెల్లడించారు.