Andhra Pradesh: వైఎస్ జగన్ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తాం.. ఆ తర్వాతే స్పందిస్తాం!: బీజేపీ నేత జీవీఎల్
- ఆర్టికల్ 370 రద్దుకు చాలా పార్టీలు సహకరించాయి
- చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి
- బాబు అడిగిందే జగన్ అడగడం సరికాదు
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు చాలా పార్టీలు సహకరించాయని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోరితే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలనీ, చాలా కష్టపడ్డానంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.
సాధ్యం కావని చెప్పిన అంశాలనే సీఎం జగన్ కోరడం విడ్డూరంగా ఉందని జీవీఎల్ అన్నారు. కొన్ని అంశాలు అమలు చేయడం సాధ్యం కాదని గతంలో చంద్రబాబుకు చెప్పామనీ, అవే జగన్ కూ వర్తిస్తాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇస్తున్నామనీ, ఆ తర్వాతే ప్రభుత్వ పనితీరుపై స్పందిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టులు రద్దుచేస్తే టీడీపీ నేతలు అంతలా ఎందుకు బాధపడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు. టీడీపీ కాంట్రాక్టర్ల పార్టీనా? అని ప్రశ్నించారు. తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టులు రద్దుచేయడం తప్పుకాదనీ, అయితే కావాలని రద్దుచేయడం తప్పని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.