Vijayawada: రేపు విజయవాడలో నిర్వహించేది పెట్టుబడుల సదస్సు కాదు: పరిశ్రమల శాఖ కార్యదర్శి
- ఇది విదేశీ రాయబారులతో పరస్పర అవగాహన సదస్సు
- 35 దేశాల నుంచి 40 మంది రాయబారులు, కాన్సుల్ జనరల్స్ హాజరుకానున్నారు
- సీఎంతో 13 మంది రాయబారులు ముఖాముఖీ మాట్లాడనున్నారు
రేపు విజయవాడలో నిర్వహించేది పెట్టుబడుల సదస్సు కాదని, విదేశీ రాయబారులతో పరస్పర అవగాహన సదస్సు మాత్రమేనని ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి రజత్ భార్గవ స్పష్టం చేశారు. 35 దేశాల నుంచి 40 మంది రాయబారులు, కాన్సుల్ జనరల్స్ హాజరుకానున్నారని, విదేశాంగ శాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోందని చెప్పారు. 35 దేశాల విదేశీ రాయబారులు ఒకే చోట భేటీ కావడం దేశంలోనే ప్రథమం అని పేర్కొన్నారు.
ఈ సదస్సు ద్వారా ఏపీలో వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం, మంత్రులు వివరిస్తారని అన్నారు. నవరత్నాల పథకాల్లోని వివిధ అంశాలపై పెట్టుబడులకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని, ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలు తమ ఆసక్తిని కనబరిచాయని తెలిపారు. ఈ సదస్సులో సీఎంతో పదమూడు మంది రాయబారులు ముఖాముఖీ మాట్లాడనున్నారని అన్నారు.