Jammu And Kashmir: కేంద్రం నిర్ణయానికి మద్దతు పలికిన జమ్మూకశ్మీర్ చివరి మహారాజు తనయుడు
- కేంద్రం నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన పనిలేదన్న కరణ్ సింగ్
- బిల్లు గురించి రాష్ట్ర ప్రజలతో విస్తృతంగా చర్చించాలని సూచన
- అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలంటూ విజ్ఞప్తి
ఆర్టికల్ 370 రద్దు చేయడంతోపాటు జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఓ కీలకమైన వ్యక్తి నుంచి మద్దతు లభించింది. జమ్మూకశ్మీర్ కు చివరి మహారాజు హరిసింగ్ తనయుడు, కేంద్ర మాజీ మంత్రి కరణ్ సింగ్ కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా ఖండించాల్సిన అవసరంలేదని, వాటి గురించి రాష్ట్ర ప్రజలతో విరివిగా చర్చించాలని అభిప్రాయపడ్డారు. పునర్విభజన బిల్లు రాజకీయ అధికారాలను సరైన రీతిలో విభజిస్తుందని అన్నారు.
అయితే, అరెస్ట్ చేసిన నేతలను విడుదల చేసి, రాష్ట్ర పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యతిరేకత అనే కారణంతో రెండు ప్రధాన పార్టీల నాయకులను నిర్బంధించడం సరికాదని, ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేశారని ఈ కాంగ్రెస్ నేత తెలిపారు.