Jammu And Kashmir: కశ్మీర్లో కేంద్రపాలన తాత్కాలికమే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం: ప్రధాని మోదీ
- జమ్ముకశ్మీర్ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా
- యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ
కశ్మీర్ లో కేంద్ర పాలన తాత్కాలికమేనని, అక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాక ఆ పాలన ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370, 35-A రద్దు తర్వాత తొలిసారిగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ పోలీసులకు కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుందని చెప్పారు. జమ్ముకశ్మీర్ యువతకు ఇకపై కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
జమ్ముకశ్మీర్ లో ఇన్నాళ్లూ, విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైనా కశ్మీర్ లో అమలు కాలేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నా, ఇక్కడ మాత్రం లేవని, అదే విధంగా కనీసవేతన చట్టం కూడా ఇక్కడ లేదని గుర్తుచేశారు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించామని, దేశ అభ్యున్నతి కోసం చేసే చట్టాలు ఇకపై జమ్ముకశ్మీర్ లో కూడా వర్తిస్తాయని చెప్పారు.