Andhra Pradesh: పుల్వామా తరహా దాడులకు అవకాశం.. ఆంధ్రప్రదేశ్లో హై అలెర్ట్!
- ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హై అలెర్ట్
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుట్ర
- విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం
కశ్మీర్ సహా దేశంలో పుల్వామా తరహా దాడులకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లో కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈ దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న దాడులు చేసేందుకు జైషే మహ్మద్ కుట్ర పన్నినట్టు గుర్తించిన నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వైమానిక దాడులకు ఆస్కారం ఉందన్న సమాచారంతో అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపటి నుంచి 20వ తేదీ వరకు టికెట్లు తీసుకున్న ప్రయాణికులను తప్ప సందర్శకులెవరినీ విమానాశ్రయాల్లోకి అనుమతించరు.