Kesineni Nani: జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాను: కేశినేని నాని కీలక ట్వీట్
- బందర్ పోర్టు ఒప్పందం రద్దు
- ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ సర్కారు
- పోర్టు విషయమై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్న నాని
బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని విజయవాడ లోక్ సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "సీఎం గారు... మీరు తీసుకున్న ఈ నిర్ణయంను నేను సమర్ధిస్తాను. కానీ ఈ పోర్టును తెలంగాణాకో, వాన్ పిక్ కో లేక ఇతర ప్రైవేట్ వారికో ధారాదత్తం చేయకుండా ప్రభుత్వమే చేపట్టే నిర్ణయం తీసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి" అని అన్నారు.
కాగా, ఈ ప్రాజెక్టు పనులను సకాలంలో చేపట్టలేదన్న కారణంతో గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ఇచ్చిన కాంట్రాక్టు ఒప్పందాన్ని జగన్ సర్కారు రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు లీజుకిచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు పరిహారం కోరే అవకాశాలను పరిశీలించాలని కూడా ప్రభుత్వం న్యాయ నిపుణులను కోరింది.