Amit Shah: కేసీఆర్ జాతకాల పిచ్చితో భవనాలు కూల్చేస్తున్నారు: అమిత్‌షాకు లక్ష్మణ్ ఫిర్యాదు
- అమిత్ షాతో 20 నిమిషాలు భేటీ
- తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చ
- టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని సూచన
జాతకాలు, వాస్తుపై నమ్మకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ పార్టీ చీఫ్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ వివేక్ నిన్న ఢిల్లీలో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా షాతో లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్‌లు భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను లక్ష్మణ్ వివరించారు. జాతకాలు, వాస్తులపై నమ్మకాలతో సచివాలయ భవనాలను కూల్చేస్తున్నారని తెలిపారు. జమ్ముకశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని, పార్టీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు నష్టం కలిగించే అంశాలపై పోరాడాలని సూచించారు.