ISRO: విద్యార్థులకు ఇస్రో బంపర్ ఆఫర్... చంద్రుడిపై చంద్రయాన్-2 దిగడాన్ని ప్రత్యక్షంగా వీక్షించే చాన్స్!
- 8-10వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీ
- ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు విజేతల ఎంపిక
- ప్రధాని మోదీతో కలిసి వీక్షించేందుకు ఇస్రో ఏర్పాట్లు
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజక్టు చంద్రయాన్-2. ఇటీవలే రోదసిలో ప్రవేశించిన చంద్రయాన్-2 సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధృవంలో కాలుమోపనుంది. ఈ అద్భుత ఘడియలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఓ ఆన్ లైన్ టాలెంట్ పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. వారికి చంద్రుడిపై చంద్రయాన్-2 దిగడాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తారు.
ఇస్రో టాలెంట్ పోటీలో పాల్గొనాలంటే, మొదట విద్యార్థులు ISRO MyGov పోర్టల్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్ లైన్ క్విజ్ నిర్వహిస్తారు. ఈ క్విజ్ లో పెద్దవాళ్లు తమ పిల్లలకు సహకరించవచ్చు కానీ, సమాధానాలు పూర్తిగా పెద్దవాళ్లే చెప్పకూడదు. ఈ విషయంలో పెద్దవాళ్లు నైతికత పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
ఆగస్టు 10 నుంచి 20వ తేదీ వరకు ఈ ఆన్ లైన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 10న 12.01 గంటలకు ప్రారంభమై ఆగస్టు 20న 11.59 గంటలకు ముగుస్తుంది. పోటీలో పాల్గొనే విద్యార్థి 10 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. పోటీ మొదలైన తర్వాత మధ్యలో నిలిపివేయడం వీలుకాదు. కాల పరిమితితో కూడిన క్విజ్ కాబట్టి వేగంగా స్పందించే విద్యార్థులను గుర్తించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది.
ఒక్కో రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్-2 చంద్రుడిపై దిగే మధుర క్షణాలను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది.