Jammu And Kashmir: వీరప్పన్ కథ ముగించిన యోధుడికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు?
- ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందిన విజయ్ కుమార్
- 2018లో కశ్మీర్ భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియామకం
- జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా విజయ్ కుమార్ వైపే మొగ్గుచూపిన కేంద్రం!
గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ కు చరమగీతం పాడిన మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కు అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయ్ కుమార్ ను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించినట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి భవన్ చేరుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్ 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో ఐపీఎస్ అధికారిగా అనేక కష్టసాధ్యమైన టాస్క్ లను పూర్తి చేశారు. వాటిలో వీరప్పన్ ఉదంతం కూడా ఉంది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను, అధికారులను, పోలీసులను దశాబ్దాల పాటు హడలెత్తించిన కరుడుగట్టిన స్మగ్లర్ వీరప్పన్ ను తన తెలివితేటలతో మట్టుబెట్టిన అసాధ్యుడు విజయ్ కుమార్.
చెన్నైలో పెరిగిపోయిన నేరాల రేటును తనదైన పద్ధతిలో తగ్గించిన ఘనత విజయ్ కుమార్ సొంతం. చెన్నై కమిషనర్ గా పనిచేసిన కాలంలో ఎంతోమంది క్రిమినల్స్ ను ఆయన ఎన్ కౌంటర్ చేసినట్టు చెబుతుంటారు. కఠినంగా వ్యవహరించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తాయి.
ఈ నేపథ్యంలో, విజయ్ కుమార్ అయితే జమ్మూకశ్మీర్ పరిస్థితులను నియంత్రణలో ఉంచుతాడని కేంద్రం భావిస్తోంది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకశ్మీర్ ను రెండు ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడఖ్ పేరిట రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించనున్నారు.
జమ్మూకశ్మీర్ కు విజయ్ కుమార్ పేరు ఖరారైనట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతేడాది నుంచి కశ్మీర్ భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఆయనకు కలిసొచ్చే అంశం.