Jammu And Kashmir: కశ్మీరీ గొర్రెల గురించి స్థానికులతో ముచ్చటించిన అజిత్ ధోవల్
- ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ లో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు
- ఓ గొర్రెల పెంపకందారుతో మాట్లాడిన వీడియో వైరల్
- దోవల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన కశ్మీరీ యువకుడు
భారత జాతీయ భద్రతా సలహాదారు, వ్యూహ నిపుణుడు అజిత్ ధోవల్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానిక స్థితిగతులను అంచనా వేసేందుకు ధోవల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ గొర్రెల పెంపకందారుడితో ముచ్చటించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
ధోవల్ ఎవరో తెలియని ఆ కశ్మీర్ యువకుడు తన గొర్రెల గురించి అనేక వివరాలు పంచుకున్నాడు. అడగడమే తరువాయి, గొర్రెలకు తాను పెట్టే దాణా, వాటి బరువు తీరుతెన్నులను ధోవల్ కు వివరించాడు. తాము గొర్రెలను కార్గిల్ లో కొనుగోలు చేసి ద్రాస్ లో అమ్ముతుంటామని చెబుతూ, ఇంతకీ మీకు ద్రాస్ ఎక్కడుంటుందో తెలుసా అంటూ ప్రశ్నించాడు.
ధోవల్ జవాబు చెప్పేంతలో అనంతనాగ్ డీసీపీ జోక్యం చేసుకుని ఆ స్థానిక కశ్మీరీ యువకుడికి ఆయనెవరో చెప్పారు. ధోవల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఆ గొర్రెల పెంపకందారు కరచాలనం చేసి సంతోషం వ్యక్తం చేశాడు.