Pruthviraj Jadeja: గుజరాత్ లో సూపర్ పోలీస్.. ఇద్దరు చిన్నారులను భుజాలపై ఎత్తుకుని కాపాడిన జడేజా!
- గుజరాత్ లో కుండపోత వర్షాలు
- మోర్బీ జిల్లాలో వరద ప్రవాహంలో చిక్కుకున్న చిన్నారులు
- భూజాలపై ఎత్తుకుని ఒడ్డుకు తీసుకొచ్చిన జడేజా
కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. పలుచోట్ల రోడ్డు తెగిపోవడం, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పృధ్వీరాజ్ జడేజా వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మోర్బి జిల్లాలోని కళ్యాణ్ పర్ గ్రామంలో ఇద్దరు చిన్నారులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు.
దీన్ని గమనించిన పృధ్వీరాజ్ క్షణం కూడా ఆలోచించకుండా రంగంలోకి దూకేశారు. నీటి ప్రవాహానికి అవతల ఉన్న ఇద్దరు చిన్నారులను భుజాలపై ఎత్తుకుని 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇవతలకు వచ్చాడు. ఈ సందర్భంగా నడుములోతులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా జడేజా భయపడకుండా చిన్నారులను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తో పాటు పలువురు రాజకీయ, సినీప్రముఖులు జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు.