Nagarjuna Sagar: కనువిందు చేస్తున్న జలదృశ్యం... నాగార్జునసాగర్ డ్యామ్ గేట్ల ఎత్తివేత!
- 550 అడుగులు దాటిన నీటిమట్టం
- గేట్లను తెరిచి పులిచింతలకు నీటి విడుదల
- నాలుగు గేట్లను తెరచిన అధికారులు
దాదాపు పదేళ్ల తరువాత కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎన్నడూ లేనంత నీరు వస్తుండటంతో, అనుకున్న సమయంకన్నా ముందుగానే నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది. శ్రీశైలం నుంచి వస్తున్న నీటి ప్రవాహం అంతకంతకూ పెరిగి 8 లక్షల క్యూసెక్కులను దాటడంతో, 590 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ లో 550 అడుగులకు నీరు చేరింది.
ఈ ఉదయం జలాశయం నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు, పులిచింతలకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. మరోవైపు కుడి, ఎడమ కాలువల నుంచి పూర్తి స్థాయిలో నీటిని వదులుతున్నారు. ఇక సాగర్ గేట్లు తెరవడంతో, దాదాపు 600 అడుగుల ఎత్తునుంచి కిందకు దుమికే కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు మాచర్ల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. రేపటికి సాగర్ కు సందర్శకులు మరింతగా పెరిగే అవకాశముంది.
కాగా, ఇటీవలి కాలంలో ఆగస్టు రెండో వారంలోనే నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరవడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ఇక కృష్ణానది నుంచి వివిధ జిల్లాలకు దారితీసే ఎస్ఆర్ బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి సర్కారు సన్నాహాలు చేస్తుండటంతో రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సంవత్సరం నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.