Andhra Pradesh: పోలవరం కట్టడం అంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ నిర్వహించడం అంత ఈజీ అనుకుంటున్నారు!: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యంగ్యం
- కాఫర్ డ్యామ్ వల్లే ముంపు వచ్చిందని మాట్లాడుతున్నారు
- ఈ ప్రాంతాలన్నీ 2 నెలల క్రితమే ఖాళీ చేయాలని చెప్పారు
- మీ చేతకానితనానికి నన్ను చూపించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు కట్టడం అంటే బెట్టింగులు నిర్వహించినంత సులభమని కొందరు మేధావులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయి. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జలవనరుల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్మాణం ఉంటుంది. ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి, కష్టపడి డిజైన్లను అందిస్తారు. ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు.
అలాగే ‘పోలవరంలాంటి ప్రాజెక్ట్ కట్టడం అంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ లు నిర్వహించినంత సులభమని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కాఫర్ డ్యాం కట్టటం వల్లే ఈ రోజు గ్రామాలు మునిగిపోయాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారు. గోదావరి నదికి వరద వస్తుందని, ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని రెండు నెలల ముందే పోలీస్, రెవిన్యూ యంత్రాంగాలను అధికారులు అప్రమత్తం చేశారు. మరి ఈ మేధావులు ఇన్నాళ్ళూ ఏం చేశారు? మీకు చేతకాని ప్రతి పనికీ నన్ను చూపించడం మాని, ఇప్పటికైనా పరిపాలన ఎలా చెయ్యాలో నేర్చుకోండి’ అని చంద్రబాబు హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు ఓ వీడియోను పోస్ట్ చేశారు.