Shashi Tharoor: శశిథరూర్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోల్ కతా కోర్టు
- గత ఏడాది బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన థరూర్
- ఇండియాను హిందూ పాకిస్థాన్ చేస్తారంటూ వ్యాఖ్య
- రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు కోల్ కతాలోని ఓ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'హిందూ పాకిస్థాన్'ను బీజేపీ ఏర్పాటు చేస్తుందంటూ గత ఏడాది ఆయన చేసిన వ్యాఖ్యలపై సుమీత్ చౌదరి అనే అడ్వొకేట్ కేసు వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు శశి థరూర్ కు వారెంట్ జారీ చేసింది.
గత ఏడాది జూలైలో తిరువనంతపురంలో శశిథరూర్ ప్రసంగిస్తూ, 2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే... హిందూ పాకిస్థాన్ ఏర్పాటు దిశగా పరిస్థితులు మారుతాయని అన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగం తరహాలో కొత్త రాజ్యాంగాన్ని బీజేపీ రచిస్తుందని... ఆ రాజ్యాంగం ప్రకారం మైనారిటీల హక్కులకు ఎలాంటి గౌరవం ఉండబోదని వ్యాఖ్యానించారు.
బీజేపీకి అవసరం లేని, నచ్చని అంశాలన్నింటినీ రాజ్యాంగం నుంచి తొలగిస్తారని... వారికి నచ్చినట్టు మార్చివేస్తారని అన్నారు. హిందూ రాష్ట్ర సిద్ధాంతాలను రాజ్యాంగంలో పెడతారని... దీంతో, దేశంలోని మైనార్టీలు సమాన హక్కులను కోల్పోతారని చెప్పారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా అజాద్ వంటి మహనీయులు ఇలాంటి పరిస్థితి కోసం స్వాతంత్ర్య పోరాటం చేయలేదని అన్నారు.