cm: గతంలో రాయలసీమకు నీళ్లు రాకుండా కేసీఆర్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు: సీపీఐ రామకృష్ణ ఫైర్
- రాయల సీమకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ యత్నించారు
- ఇప్పుడేమో సీమను సస్యశ్యామలం చేస్తామంటున్నారు!
- ఆయన ఏడుపేదో ఆయన ఏడ్చుకుంటే బాగుంటుంది
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ అన్నివిధాల యత్నించారని ఆరోపించారు. బ్రిజేశ్ ట్రైబ్యునల్ లో ఏపీకి వ్యతిరేకంగా పిటిషన్ వేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న బోయి మన రోజమ్మ (ఎమ్మెల్యే రోజా) పెట్టిన ఫుడ్ తిని ‘రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం’ అని ఆయన అంటాడు. ఆయన ఏడుపేదో ఆయన ఏడ్చుకుంటే బాగుంటుంది. రాయలసీమకు వ్యతిరేకంగా నువ్వు (కేసీఆర్) ఎన్ని పనులు చేస్తాన్నావు? బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు రాయలసీమ ప్రాజెక్టులు హంద్రినీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ లు ఏవీ కూడా కృష్ణా బేసిన్ లో రావు, వాళ్లకు నీళ్లివ్వకూడదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరపున బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ లో అఫిడవిట్లు దాఖలు చేశారు’ అని కేసీఆర్ పై మండిపడ్డారు.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి ఆలయాన్ని నిన్న సందర్శించిన విషయం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటలపాటు అక్కడ గడిపారు.