Andhra Pradesh: టీడీపీలో తెల్ల ఏనుగులను బయటకు పంపాల్సిందే.. లేదంటే కష్టమే!: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- టీడీపీలో ప్రక్షాళన జరగాలి
- పదేపదే ఓడుతున్నవారిని నెత్తిన పెట్టుకుంటున్నారు
- టీడీపీ అధిష్ఠానంపై బుచ్చయ్య సునిశిత విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనులు చేసినా ఫలితాలు రాలేదని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలోని పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికైనా ప్రక్షాళన జరగాలనీ, లేదంటే కష్టమేననీ వ్యాఖ్యానించారు. పదేపదే ఓడుతున్నవారిని పార్టీ అధిష్ఠానం ఎందుకు నెత్తిన పెట్టుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ఈ తెల్ల ఏనుగులను బయటకు పంపాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఈ నేతలు పదవులు అనుభవిస్తున్నప్పటికీ, పార్టీకి సేవలు చేయలేకపోతున్నారనీ, జిల్లాల్లో పార్టీ కోసం పనిచేయలేకపోతున్నారని విమర్శించారు. ‘ఎవరైతే ప్రజల్లోకి వెళ్లి వారి హృదయాలను గెలుచుకుంటారో అలాంటి నాయకత్వం బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేతప్ప కోటా పద్ధతిలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం వల్లే ప్రయోజనం ఉండదు’ అని తేల్చిచెప్పారు.
టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్ జారిపోవడం, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో ఎందుకు విఫలమయ్యామన్న విషయాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మహిళలకు పార్టీలో 20 శాతం పదవులు ఇవ్వాలని చెప్పారు.