Bollywood: పాక్ లో సంగీత కచేరి చేసిన బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ పై నిషేధం!
- కరాచీలో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మికా
- నిషేధం విధించిన ఏఐసీడబ్ల్యూఏ
- మికాతో పనిచేస్తే చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ కు షాక్ తగిలింది. భారత్-పాకిస్థాన్ ల మధ్య ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మికా కరాచీలో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బంధువు వివాహ వేడుకలో ప్రదర్శన నిర్వహించారు. దీంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసీడబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ లో ప్రదర్శన నిర్వహించినందుకు మికా సింగ్ పై నిషేధం విధించింది.
‘ప్రొడక్షన్ హౌజ్‌లు, మ్యూజిక్ కంపెనీలు, ఆన్లైన్ మ్యూజిక్ కంటెంట్ ప్రొవైడర్లు మికాసింగ్‌తో కలిసి పనిచేయడాన్ని ఏఐసీడబ్ల్యూఏ నిషేధించింది. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మికా సింగ్ చేసిన పని దేశ ఔనత్యాన్ని తగ్గించేలా ఉంది’ అని ఏఐసీడబ్ల్యూఏ మండిపడింది.
జమ్మూకశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు, రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ లుగా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్.. భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించింది.