India: విద్యుత్ పీపీఏల పున:సమీక్ష.. ఏపీ సర్కారుకు జపాన్ ఘాటు లేఖ!
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన జపాన్
- పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్య
- ఇప్పటికే కుదిరిన ఒప్పందాలపై సమీక్షెందుకని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ సీఎం జగన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ సర్కారు హయాంలో భారీ ధరలకు పీపీఏలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం జరిగిందని ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటీవల కేంద్ర ఇంధన శాఖ అభ్యంతరం వ్యక్తం చేయగా, తాజాగా జపాన్ ఈ విషయమై తీవ్రంగా స్పందించింది.
విద్యుత్ పీపీఏలను పున:సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని జపాన్ తెలిపింది. ఇప్పటికే మనుగడలో ఉన్న విద్యుత్ పీపీఏల జోలికి వెళ్లడం ఎందుకని ప్రశ్నించింది. భారత పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ కు చెందిన ఎస్ బీ ఎనర్జీ, రెన్యూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ దౌత్య కార్యాలయం ఈ విషయమై కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి ఘాటు లేఖలు రాసింది.