Vijayawada: ప్రకాశం బ్యారేజ్ కు జలకళ.. పరిశీలించిన మంత్రులు
- పున్నమి ఘాట్, బరంపురం పార్క్, వరద ముంపు ప్రాంతాల పరిశీలన
- డ్యాములు అన్నీ నిండు కుండల్లా మారాయి
- ముంపు సంభవించే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం: వెల్లంపల్లి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వైపు వరద నీరు పరవళ్ళు తొక్కుతున్న నేపథ్యంలో కృష్ణా బ్యారేజి నుంచి 70 గేట్ల ద్వారా 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కన్న బాబు, కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులతో కలిసి ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఈరోజు పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, పున్నమి ఘాట్, బరంపురం పార్క్, వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజ్ నుంచి 70 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేశామని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో డ్యాములు అన్నీ నిండు కుండల్లా మారాయని సంతోషం వ్యక్తం చేశారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముంపు సంభవించే ప్రాంతాల్లో ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశించారని అన్నారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మాజీ సిఎం చంద్రబాబునాయుడు నది ఒడ్డున కరకట్ట ప్రాంతంలో నివసిస్తున్నారని, ఇప్పుడు ఆయన ఇంటిలోకి వరద నీరు చేరి ఇసుక మేటలు కప్పుతున్నాయని, దీంతో, ఆయన హైదరాబాద్ పారిపోయే పరిస్థితి తలెత్తిందని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంతకుముందు కన్నబాబు మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగటంతో వరదలు కూడా పోటెత్తుతున్నాయని, కృష్ణా జిల్లాలో నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు చెప్పారు. కృష్ణా జిల్లాలో 17 మండలాలు విజయవాడలో 13,14,15 డివిజన్లలో ముందస్తు జాగ్రత్త చర్యలతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారని చెప్పారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను స్నానానికి నదిలో దిగవద్దని సూచించారు. ముందస్తుగా గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను నియమించినట్టు చెప్పారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నటు వివరించారు.