Tihar: ఖైదీగా ఉన్న ప్రియుడి కోసం జైలు అధికారితో స్నేహం... తీహార్ జైల్లో ప్రేమాయణం!
- జైల్లో కాలం గడుపుతున్న హేమంత్
- ఉన్నతాధికారి సాయంతో గంటల కొద్దీ జైల్లో గడిపే యువతి
- విషయం బయటకు పొక్కి విచారణ మొదలు
అది ఇండియాలో అత్యంత భద్రత కలిగిన తీహార్ జైలు. అందులో ఎంతో మంది ఉగ్రవాదుల నుంచి, కరుడుగట్టిన నేరస్థుల వరకూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, అదే జైలులో ఉన్న తన ప్రియుడిని తరచూ కలుసుకునేందుకు ఓ యువతి మాస్టర్ ప్లాన్ వేసింది. జైలులో ఉన్న ఓ అధికారికి దగ్గరైంది. అతని సాయంతో పదేపదే జైలులోకి వెళ్లి, గంటల కొద్దీ ప్రియుడితో గడిపింది. ఈ వ్యవహారం ఇప్పుడు బయటకు రావడంతో, సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఎంక్వయిరీని ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే...
తీహార్ జైల్లో హేమంత్ అనే వ్యక్తి శిక్షను అనుభవిస్తుండగా, అతనికి ఓ ప్రియురాలు ఉంది. ప్రియుడిని వదిలి ఉండలేనని భావించిన ఆమె, హేమంత్ ప్లాన్ మేరకు, తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ గా నమ్మబలికి తొలుత జైలు లోపలికి రావడం ప్రారంభించింది. ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ఆమె వస్తోందని నమ్మిన అధికారులు, తొలుత అనుమతించేవారు. ఇదే సమయంలో ఓ జైలు అధికారితో ఆమె స్నేహం ప్రారంభించింది. జైల్లోని ప్రియుడిని అడ్డూ అదుపూ లేకుండా కలిసేది. గంటల తరబడి అతనితో గడిపేది. ఈ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
ఆమెకు దగ్గరగా ఉన్న జైలు అధికారిపైనా, ఆమె మాటలను జైలు సిబ్బంది ఎలా నమ్మారన్న విషయంపైనా విచారణ జరిపిస్తామని అధికారులు వెల్లడించారు. జరిగినది తీవ్రమైన నిర్లక్ష్యమని, విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, రిపోర్టు రాగానే కఠిన చర్యలు చేపడతామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.