Kidnap: గుంటూరు యువతి కిడ్నాప్ డ్రామా... నానా హైరానా పడి విషయం తేల్చిన హైదరాబాద్ పోలీసులు!

  • విల్లా మేరీ లో చదువుతున్న గుంటూరు యువతి
  • చదువు కష్టమై కిడ్నాప్ చేయబడినట్టు నాటకం
  • సీసీటీవీ ఫుటేజ్ లను చూసి గట్టిగా ప్రశ్నిస్తే నిజం బయటకు

చదువు కోవడం ఇష్టంలేని ఓ యువతి, కిడ్నాప్ డ్రామా ఆడగా, ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు చివరకు విషయాన్ని తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరుకు చెందిన యువతి (18), హైదరాబాద్ లోని విల్లామేరీ కాలేజీలో బీఎస్‌సీ కంప్యూటర్‌ చదువుతోంది. లేడీస్ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయి, ఇటీవల కాలేజీకి వరుసగా సెలవులు రావడంతో లింగంపల్లిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి, 12 సాయంత్రం తిరిగి హాస్టల్ కు వెళతానని బయలుదేరింది. హాస్టల్ నుంచి గమ్‌ తెచ్చుకుంటానని స్టేషనరీ షాప్ కు వెళుతున్నట్టు చెప్పి బయటకు వచ్చింది. మరుసటి రోజు గుంటూరులో ప్రత్యక్షమై తనను ఎవరో కిడ్నాప్ చేశారని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి ఆమెను హైదరాబాద్ కు తీసుకొచ్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వివరాలు కోరగా, స్టేషనరీ షాపు నుంచి తాను హాస్టల్ వద్దకు వెళుతుంటే, ఓ అంబులెన్స్‌ పక్కకు వచ్చిందని, ఒకరు వెనుకనుంచి బలంగా అంబులెన్స్ లోకి నెట్టారని, మరో వ్యక్తి తన ముఖంపై స్ప్రే కొట్టడంతో స్పృహ తప్పానని చెప్పింది. తెలివి వచ్చి చూసేసరికి ఓ గదిలో ఉన్నానని, చెవిదుద్దులు, సెల్‌ ఫోన్‌ కనిపించలేదని చెప్పింది. భయంతో అక్కడి నుంచి పారిపోయి, స్థానికుల సాయంతో ఆటోలో రైల్వే స్టేషన్ కు వెళ్లి, గుంటూరుకు చేరుకున్నానని చెప్పింది.

కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, యువతిని తీసుకెళ్లి, కిడ్నాప్ జరిగినట్టు చెప్పిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీకెమెరాలను పరిశీలించగా, అంబులెన్స్ వచ్చిన దాఖలాలే కనిపించలేదు. ఆపై దూరంగా ఉన్న కెమెరాల రికార్డులనూ చూసిన పోలీసులు, యువతే ఒంటరిగా బేగంపేట మెట్రో వరకూ నడిచిందని, అసలు స్టేషనరీ షాప్ కు వెళ్లలేదని తేల్చారు. ఆపై ఆమెను గట్టిగా ప్రశ్నించగా, ఇంటర్‌ వరకు బాగానే చదివిన తాను, కంప్యూటర్ పై పట్టులేక వెనుకబడిపోయానని, హాస్టల్ లో ఉండటం కూడా ఇష్టం లేదని చెప్పింది. అందుకే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు స్పష్టం చేయడంతో, ఆమెను మందలించి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.

  • Loading...

More Telugu News