Narendra Modi: దేశం కోసం చనిపోదామనుకుంటే... ఆ అవకాశం నాకు దక్కలేదు: నరేంద్ర మోదీ భావోద్వేగం
- స్వాతంత్ర్య పోరాటం నాటికి నేను పుట్టలేదు
- ఆ విధంగా ప్రాణత్యాగం చేసే అవకాశాన్ని కోల్పోయాను
- దేశం కోసం జీవించే అవకాశం మాత్రం మిగిలిందన్న మోదీ
భరతమాత కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం తనకు లభించలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఉదయం ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఆయన, భరతమాతను బ్రిటిషర్ల నుంచి విముక్తి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ సమయానికి తాను జన్మించలేదని, దేశం కోసం మరణించే అవకాశం ఆ విధంగా తనకు దూరమైందని అన్నారు.
అయితే, మరణించే అవకాశం లభించని తనకు దేశం కోసం జీవించే అవకాశం లభించిందన్న తృప్తి మిగిలిందని అన్నారు. నాటి అమర వీరుల త్యాగాలు నేటి తరానికి ఆదర్శమని, వారిని తలుచుకుంటే మనసంతా గర్వంతో నిండిపోతుందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం ఎంతో మంది ప్రాణాలను బలిగొందని, వారు చేసిన త్యాగాలపైనే నేటి నవీన భారతావని నిర్మితమైందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి అడుగు జాడల్లో నడవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.