Imran Khan: భారత ఆక్రమిత కశ్మీర్ అంటూ... మళ్లీ నోరు పారేసుకున్న ఇమ్రాన్ ఖాన్!
- కశ్మీర్ లో ఆర్ఎస్ఎస్ గూండాలు
- ఐఓకేలో నరమేధం జరగనుంది
- చూస్తూ ఊరుకుంటే తీవ్ర పరిణామాలు
- అంతర్జాతీయ సమాజానికి ఇమ్రాన్ హెచ్చరిక
భారతావని సగర్వంగా 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న వేళ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, జమ్మూకశ్మీర్ ను భారత ఆక్రమిత కశ్మీర్ అని సంబోధించారు.
"ఐఓకేలో 12 రోజుల కర్ఫ్యూ. చేతుల్లో భారీ ఆయుధాలతో అదనపు బలగాలు. ఆర్ఎస్ఎస్ గూండాలు చేరారు. సమాచార వ్యవస్థ పూర్తిగా కనుమరుగైంది. గతంలో గుజరాత్ లో ముస్లింలను ఏరివేసినట్టుగానే, మోదీ తనదైన శైలిలో జమ్మూకశ్మీర్ లో ముస్లింలను ఏరివేయాలని చూస్తున్నారు" అని అన్నారు.
ఆపై "స్రెబ్రేనికా తరహాలో జరగనున్న నరమేధాన్ని ఈ ప్రపంచం మరోసారి చూడనుంది. ముస్లింలను ఐఓకే నుంచి ఏరివేయడమే వారి లక్ష్యం. అంతర్జాతీయ సమాజానికి ఇదే నా హెచ్చరిక. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. హింస చెలరేగుతుంది. ముస్లిం సమాజం దీన్ని ఎంతమాత్రమూ సహించబోదు" అని హెచ్చరించారు.