Uttar Pradesh: మా ఎమ్మెల్యే, ఎంపీ జాడ చెప్పండి.. రూ.501 బహుమతి పట్టుకెళ్లండి!: యూపీ గ్రామస్తుల వినూత్న నిరసన
- యూపీలోని సూరజ్ పూర్ గ్రామస్తుల వినూత్న నిరసన
- ఎంపీ, ఎమ్మెల్యే తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం
- స్థానిక సమస్యలను ఇంకా పరిష్కరించలేదని ఆవేదన
తమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించని నేతలపై ప్రజలు ఒక్కో చోట ఒక్కోరకంగా స్పందిస్తూ ఉంటారు. కొందరు సదరు నేతలను నేరుగా నిలదీస్తే మరికొందరు మాత్రం వినూత్నంగా తమ నిరసన తెలుపుతారు. తాజాగా అలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లో గ్రేటర్ నోయిడా పరిధిలోని సూరజ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే తేజ్పాల్ నాగర్, లోక్ సభ సభ్యుడు మహేశ్ శర్మలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తమ గ్రామంలో డ్రైనేజీతో పాటు విద్యుత్ సమస్య ఉందని ప్రజలు పలుమార్లు ఈ నేతలకు విన్నవించుకున్నారు.
కరెంట్ స్తంభాలు దెబ్బతినడం వల్ల విద్యుత్ వైర్లు కిందకు వేలాడుతున్నాయనీ, దీన్ని మార్చాలని కోరారు. అయితే సదరు నేతలు వీరి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేశారు. దీంతో సూరజ్ పూర్ వాసులకు చిర్రెత్తుకొచ్చింది. బాగా ఆలోచించిన గ్రామస్తులు తమ ఎమ్మెల్యే తేజ్పాల్ నాగర్, లోక్ సభ సభ్యుడు మహేశ్ శర్మలు కనిపించడం లేదని బ్యానర్లు రూపొందించారు. వీటి జాడను తెలిపినవారికి రూ.501 బహుమానం ఇస్తామని అందులో ప్రకటించారు. వీటిని తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఊర్లు, రోడ్లపైకూడా అంటించారు. ఇది జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.