Uttar Pradesh: పదేళ్ల ఎదురుచూపులకు ఫలితం.. తప్పి పోయిన తల్లి ఇల్లు చేరిన వైనం!
- మతి స్థిమితం కోల్పోయి ఇల్లు విడిచిన తల్లి
- ఉత్తరప్రదేశ్లో పిల్లలను కిడ్నాప్ చేస్తోందంటూ పోలీసులకు అప్పగించిన స్థానికులు
- ఆమె దైన్యాన్ని చూసి చలించిపోయిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లో జరిగిందీ ఘటన. మతిస్థిమితం కోల్పోయిన ఆ తల్లి ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు తల్లడిల్లిపోయాడు. ఆమె కోసం తెలిసిన చోటల్లా గాలించాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆమె జాడ లేదు. ఇప్పటికి పదేళ్లు అయింది. తల్లి తిరిగి వస్తుందన్న ఆశను మాత్రం అతడు కోల్పోలేదు.
అతడి ఆశను నిజం చేస్తూ ఆ తల్లి మళ్లీ కొడుకు దగ్గరికి చేరింది. తల్లిని చూసిన అతడి మనసు ఉప్పొంగిపోయింది కళ్ల వెంట అప్రయత్నంగానే నీళ్లు వచ్చాయి. గుజరాత్లోని సఖేడాకు చెందిన శాంతాబాయి కథ ఇది. ఉత్తరప్రదేశ్లోని శంషాబాద్లో పిల్లలను కిడ్నాప్ చేస్తోందన్న అనుమానంతో స్థానికులు ఓ మహిళపై దాడిచేసి అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమెను చూసి చలించిపోయిన పోలీసులు మెల్లిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమారుడు మహేంద్రకు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే శంషాబాద్ వెళ్లిన మహేంద్రను గుర్తుపట్టిన ఆ తల్లి కుమారుడిని హత్తుకుంది. తల్లిని చూసిన కుమారుడి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.