Andhra Pradesh: కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయండి!: ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
- కృష్ణా వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం
- భారీగా వరద వస్తోందని చెప్పిన అధికారులు
- సహాయక చర్యలను చేబట్టాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నదికి వరదలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు వెళ్లేముందు ఆయన వరద పరిస్థితిపై సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఎగువ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతోందని ముఖ్యమంత్రికి చెప్పారు.
వేర్వేరు రిజర్వాయర్ల నుంచి విడుదల అవుతున్న నీటి వివరాలను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ..కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు వరద ప్రవాహం కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.