Prakasam District: తన పెళ్లికి దాచిన డబ్బును పొరపాటున బుగ్గిపాలు చేసిన యువతి!
- ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘటన
- కుమార్తె పెళ్లికి డబ్బు, నగలు కూడబెట్టిన తండ్రి
- వంట నిమిత్తం నిప్పు వెలిగించి బయటకెళ్లిన కూతురు
అసలే పేద కుటుంబం. పైగా పెళ్లికి ఎదిగిన కుమార్తె. ఆరుగాలం శ్రమించిన ఆ పేద తండ్రి కుమార్తె వివాహాన్ని జరిపించాలన్న ఉద్దేశంతో పైసాపైసా కూడబెడుతూ రూ. 4 లక్షల నగదును, రూ. 2 లక్షల విలువైన బంగారాన్ని కూడబెట్టుకున్నాడు. కుమార్తె వివాహంతో పాటు కుమారుడికి కూడా ఒకేసారి పెళ్లి జరిపిస్తే ఖర్చులు తగ్గుతాయని భావించాడు. కానీ, తాను ఎవరికోసమైతే డబ్బును దాచాడో, ఆ కూతురు చేసిన పొరపాటుతోనే డబ్బుతో పాటు ఉంటున్న ఇల్లు కూడా బుగ్గి అవడంతో ఆ తండ్రి ఇప్పుడు బావురుమంటున్నాడు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా దర్శి సమీపంలోని రాజంపల్లి సమీపంలో ఉన్న అనపర్తివారిపాలెంలో జరిగింది. బాధితులు వెల్లడించిన సమాచారం మేరకు, అనపర్తి బాలకోటయ్య అనే వ్యక్తి, ఓ పూరింటిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్యతో పాటు, పెళ్లీడు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నిన్న ఉదయం 10 గంటల సమయంలో భార్యా భర్తలు గడ్డి కోసం పొలానికి వెళ్లగా, వంట చేసే నిమిత్తం మంట వెలిగించిన కుమార్తె, తలుపులు వేసి, తాము కట్టించుకుంటున్న కొత్త ఇంటి వద్దకు వెళ్లింది. ఈలోగా మంటలు పెరిగి, అదుపుచేసే వారు లేక, ఇంటికి అంటుకున్నాయి. విషయాన్ని గమనించేలోగానే ఇల్లు బుగ్గిగా మారింది.
దర్శి నుంచి అగ్నిమాపకయంత్రం వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలు కాలిపోయాయి. మొత్తం రూ. 7 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాలకోటయ్య వాపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు.