Andhra Pradesh: మలికిపురం ఎస్సైను సస్పెండ్ చేయకపోతే పవన్ ను తీసుకొచ్చి ధర్నా చేస్తాం!: జనసేన ఎమ్మెల్యే రాపాక
- తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తో ఎమ్మెల్యే భేటీ
- అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు
- ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్
జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈరోజు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిని కలుసుకున్నారు. జిల్లాలోని ప్రజల సమస్యలు, తన ప్రోటోకాల్ వివాదాలపై ఆయన కలెక్టర్ తో చర్చించారు. ఇటీవల జిల్లాలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని రాపాక ఫిర్యాదు చేశారు.
తనతో దురుసుగా ప్రవర్తించిన మలికిపురం ఎస్సై రామారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎస్సైని సస్పెండ్ చేయకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాగా, ఎస్సై రామారావు విషయాన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎమ్మెల్యే రాపాకకు హామీ ఇచ్చారు.
ఇటీవల పేకాట ఆడుతూ అరెస్టయిన నిందితులను వదిలిపెట్టాలని జనసేన ఎమ్మెల్యే రాపాక మలికిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాపాకపై కేసు నమోదుకాగా, స్టేషన్ బెయిల్ మంజూరయింది.