Andhra Pradesh: 3 రోజుల నుంచి డ్రోన్ సర్వే కొనసాగుతోంది.. ఇక డ్రామాలు ఆపండి!: టీడీపీ నేతలపై ఏపీ మంత్రి అనిల్ ఆగ్రహం
- ప్రకాశం బ్యారేజీకి మరింత వరద రావచ్చు
- వరద నష్టంపై అంచనాల కోసమే విజువల్స్ చిత్రీకరణ
- టీడీపీ నేతలు ప్రభుత్వ విధుల్ని అడ్డుకుంటున్నారు
టీడీపీ నేతలు ప్రతీదానికి దిగజారిపోయి మాట్లాడుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి గత 4 రోజులుగా 4-5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి మరింత ఎక్కువ వరద వచ్చే అవకాశముందని చెప్పారు. గత 3 రోజులుగా ఈ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా విజువల్స్ తీయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఎక్కడెక్కడ వరద ముంపు వస్తుంది. ఎంత నష్టం జరుగుతుంది? అనే కోణంలో అంచనాల కోసం విజువల్స్ తీయించామని చెప్పారు. చంద్రబాబు ఉంటున్న నివాసం కరకట్టపై అక్రమంగా నిర్మించినదేనని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు తన ఇంట్లోకి నీళ్లు రాకుండా చంద్రబాబు ఇసుక బస్తాలు వేయిస్తున్నారనీ, అది కూడా చట్ట వ్యతిరేకమేనని మంత్రి తెలిపారు. ఉండవల్లిలోని నివాసం తనది కాదని ఒకరోజు మాట్లాడే చంద్రబాబు, మరోరోజు తన ఇంటి జోలికి వస్తున్నారంటూ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ శాఖ అనుమతి, ఆదేశాలతోనే డ్రోన్ల ద్వారా ఫొటోలు తీస్తున్నారని తేల్చిచెప్పారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని తాము ఎప్పుడో చెప్పామని మంత్రి అనిల్ తెలిపారు. ఇకనైనా డ్రామాలు ఆపాలనీ, ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దని టీడీపీ నేతలను హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల రక్షణ తమ బాధ్యత అని స్పష్టం చేశారు.