krishna river: కృష్ణానది మహోగ్రరూపం...వణుకుతున్న బెజవాడ

  • జల దిగ్బంధంలో పలు కాలనీలు
  • కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పుల వరకు నీరు
  • ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

కృష్ణా నది మహోగ్రరూపం దాల్చడంతో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీంతో వరద బాధిత ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 8 లక్షల క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్టు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలకు మరింత ప్రమాదం పొంచి ఉంది.

మరోపక్క, కరకట్ట దగ్గర గంటగంటకు ప్రవాహం రెట్టింపవుతోంది. పరీవాహక ప్రాంతంలోని గ్రామాలన్నీ నీటమునిగాయి. కరకట్ట వెంబడి ఉన్న పలు కాలనీల్లోకి ఇప్పటికే వరద నీరు చొచ్చుకువచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పుల వరకు నీరు చేరింది. లంక గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడుతూ బిక్కుబిక్కుమంటున్నారు. మత్స్యకారుల బోట్లు, వలలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పడవలను కాపాడుకునేందుకు మత్స్యకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

విజయవాడ కృష్ణలంక కాలనీల్లో ఎటుచూసినా నీరే కనిపిస్తోంది. ఇళ్ల నుంచి సామాన్లు తీసుకుని కరకట్టపై ఉంచి డేరాలు వేసుకుని నివాసితులు కాలం వెళ్లదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ సమీపంలో అరటి తోట మొత్తం నీట మునిగింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలోని కొంత ప్రాంతానికి వరద నీరు చేరింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News