Rahul Gandhi: కశ్మీర్లో ప్రజాస్వామ్యం ఖూనీ: మండిపడిన రాహుల్‌గాంధీ
- కాంగ్రెస్ నాయకుల అరెస్టుపై ఆగ్రహం
- ఓ జాతీయ పార్టీ పట్ల ఇలాగేనా వ్యవహరించేది
- ట్విట్టర్లో ఘాటుగా స్పందించిన రాహుల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మిర్, అధికార ప్రతినిధి రవీందర్ శర్మని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ట్విట్టర్లో స్పందించారు.
శనివారం ఆంక్షల్ని సడలించనున్నామని జమ్మూకశ్మీర్ రాష్ట్ర అధికారులు ప్రకటించిన కాసేపట్లోనే ఈ ఇద్దరు నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయంపై రాహుల్ మండిపడ్డారు.
'కాంగ్రెస్ నేతల అరెస్ట్ ను ఖండిస్తున్నాను. ఓ జాతీయ పార్టీ నాయకుల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థనే దెబ్బకొడుతున్నారు. ఇలాంటి అనాలోచిత చర్యలకు ఎప్పుడు బ్రేక్ పడుతుంది?’ అని రాహుల్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.